కంప్యుటర్ శక్తి

సమ్మె కాలం ఒప్పందాన్ని అమలు చేయాలి

  • పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కంప్యూటర్‌ టీచర్ల విజ్ఞప్తి

సమస్యల పరిష్కారం కోసం కంప్యూటర్‌ టీచర్లు సమ్మె చేసిన సందర్భంగా కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కంప్యూటర్‌ టీచర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. సంఘం కన్వీనర్‌ ఎవి నాగేశ్వరరావు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, కమిషనర్‌లకు గురువారం లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,300 పాఠశాలల్లో 12,600 మంది కంప్యూటర్‌ ఫ్యాకల్టీలు పేద విద్యార్థులకు ఐసిటి పథకం ద్వారా కంప్యూటర్‌ విద్యనందిస్తున్నారు. కనీస వేతనాల అమలు తదితర సమస్యలపై వీరు 105 రోజలు సమ్మె చేశారు. ఈ సమ్మె అనంతరం వీరికి నెలకు రూ.2,600 వేతనం చెల్లించేటట్లు, ఇతర సమస్యలపై ఒప్పందం కుదిరింది. సమ్మె విరమణ జరిగి 5 నెలలు గడుస్తున్నా నేటికీ ఆ ఒప్పందంలోని అంశాలు అమలు కాలేదు.

రమదోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు

  • ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు విమర్శ
  • యాత్రలో వినతుల వెల్లువ

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తోందని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు విమర్శించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు చేపట్టినయాత్ర గురువారం ముగిసింది. చివరిరోజు చిలకలూరిపేట, ఆచార్య నాగార్జునవర్శిటీ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు వరకూ యాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో లక్ష్మణరావు ప్రసంగించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. యాత్రలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లాకార్యదర్శి డి.లెనిన్‌ మాట్లాడుతూ జీఓ నెం.3ను అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలకు రూ.10వేలు వేతనంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 23న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని, 28న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదంచేయాలని కోరారు. సమ్మెచేస్తున్న జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు అధ్యాపకులు గుంటూరు కలెక్టరేట్‌వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడారు.

శతాబ్దకాలంగా రాష్ట్రప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీచేయకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాల ద్వారా ఉద్యోగులను, కార్మికులను శ్రమదోపిడీ చేస్తోందని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు విమర్శించారు. యాత్రలో భాగంగా చిలకలూరిపేట మండలపరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ నెల13 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వాయిదా తీర్మానం ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. అనంతరం కంప్యూటర్‌ టీచర్లు, 108 సిబ్బంది, సెకండ్‌ ఎఎన్‌ఎంలు తమ సమస్యలపై ఎమ్మెల్సీకి వినతి పత్రాలు అందజేశారు. సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి తాండవకృష్ణ, కంప్యూటర్‌ టీచర్ల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, సిపిఎం డివిజన్‌ కార్యదర్శి పోపూరి సుబ్బారావు, సిఐటియు పట్టణఅధ్యక్షులు కార్యదర్శులు పేరుబోయిన వెంకటేశ్వర్లు, ఎం.విల్సన్‌, హెచ్‌ఎం ఉప్పలపాడి వెంకటేశ్వరరావు, 108 సిబ్బంది బాలరాజు, సిఎంటి సిబ్బంది కె.కృష్ణ, ఎస్‌ రాజారావు, వెంకాయమ్మ, కంప్యూటర్‌ టీచర్లు ధనలక్ష్మి, సంజీవరావు, విజయలక్ష్మి, పద్మ తదిరులు పాల్గొన్నారు.

వర్శిటీలో ఘనస్వాగతం

ఎమ్మెల్సీ లక్ష్మణరావు యాత్ర వర్శిటికీ చేరుకున్న సందర్భంగా వర్శిటీ ఆల్‌ యూనివర్శిటీస్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వికాసభవన్‌లో జరిగిన సభకు నాయకులు, ఎలక్ట్రికల్‌ డిఇ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ వర్శిటీల్లో రోజువారి వేతనంపై పనిచేసేవారు, ఎన్‌ఎంఆర్‌లు, గెస్ట్‌ఫ్యాకల్టీలు, హాస్టల్‌ వర్కర్ల వేతనాలు రెట్టింపు చేయాలని గతంలో జీఓ నెం.3ను తీసుకువచ్చినా ఇది అమలు కావడం లేదన్నారు. ఈ సమస్యలపై అధ్యయనం చేసేందుకే యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన సమస్యల గురించి 13 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి డి. లెనిన్‌ మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన వారు తమ సమస్యల పరిష్కారంకోసం కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఒక శాశ్వత ఉద్యోగికి ఇచ్చే జీతాన్ని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ముగ్గురికి సర్దడం శోచనీయమని అన్నారు.

వినతుల వెల్లువ

యాత్రలో భాగంగా వర్శిటీకి వచ్చిన ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు వర్శిటీలోని వివిధ సంఘాలు, ఆయా రంగాల్లో వారు ఎదురొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఆల్‌ యూనివర్శిటీస్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఎన్‌ఎంఆర్‌ వర్కర్స్‌ యూనియన్‌,హాస్టల్‌ వర్కర్స్‌ యూనియన్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, డైలీవేజ్‌ వర్కర్స్‌ యూనియన్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీలు, టైంస్కేల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తమసమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంప్యూటర్‌ టీచర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఆల్‌ యూనివర్శిటీస్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు భానుప్రసాద్‌, ఎస్‌.రత్నారెడ్డి, అంజమ్మ వివిధ సంఘాల నాయకులు ఎన్‌.ప్రసాద్‌, ఎన్‌. సాల్మన్‌, పి. శివయ్య, సత్యన్నారాయణ రామకృష్ణ, జయరామ్‌, ప్రసాద్‌, రవి, గోపాలకృష్ణ, సునీత పాల్గొన్నారు.

సమస్యలపై బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తా ..

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 13వ తేదీనుంచి జరిగే బడ్జెట్‌సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. యాత్రలో భాగంగా మంగళగిరి పట్టణానికి వచ్చిన ఆయన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులనుద్దేశించి మాట్లాడారు. రాజీవ్‌ యువకిరణాలు కింద భర్తీచేసే ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల యూనియన్‌ జిల్లా కార్యదర్శి డి.లెనిన్‌ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారంకోసం అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనలు, సమ్మెలు చేస్తున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. అనంతరం ఐకెపి, ఐకెపి యానిమేటర్లు, 108 సిబ్బంది, గృహనిర్మాణశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, కంప్యూటర్‌ టీచర్లు, హైర్‌డ్‌ ఎఎన్‌ఎంలు ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జె.నవీన్‌ప్రకాష్‌, యుటిఎఫ్‌ నాయకులు ఎబి.కుటుంబరెడ్డి, బి.మాలకొండయ్య, జనవిజ్ఞానవేదిక నాయకులు వి.గోపిరెడ్డి, సిఐటియు డివిజన్‌ ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.చెంగయ్య, అవాజ్‌ డివిజన్‌ కార్యదర్శి షంషేర్‌ఖాన్‌, భవన నిర్మాణ కార్మికసంఘం డివిజన్‌ కార్యదర్శి పి.హనుమంతరావు పాల్గొన్నారు.

కనీస వేతనం ఇవ్వాలి

ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. తాడేపల్లి యాత్రలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆయనకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అర్జీలు అందజేశారు. శాసనమండలిలో సమస్యలను ప్రస్తావించి అవి పరిష్కారమయ్యేలా కృషిచేస్తానని ఆయన కాంట్రాక్టు ఉద్యోగులకు హామీనిచ్చారు. కార్యక్రమంలో రాజేష్‌, కుమార్‌, కృష్ణవేణి రంగారావు, హుస్సేన్‌, రాజారావు, వేములదుర్గారావు, సిహెచ్‌.సుందరరావు, పి.రాఘవులు ప్రసాద్‌ పాల్గొన్నారు.

మిథ్యగా మారిన కంప్యూటర్‌ విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌స్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కంప్యూటర్‌ విద్య మిథ్యగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రారంభించినప్పటికీ రెగ్యులర్‌ టీచర్లను నియమించకపోవడంతో ఆచరణ లోపం కారణంగా క్రమంగా అది అమలుకావడం లేదు. దీంతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఈ విద్య అమలు కోసం సీలింగ్‌ సౌకర్యంతో కూడిన గదులతోపాటు విద్యుత్‌ అసౌకర్యం కలిగినప్పుడు జనరేటర్లను సైతం ఏర్పాటుచేసింది కానీ కంప్యూటర్‌ విద్య తగిన ప్రతిఫలం ఇవ్వలేదు. పట్టణంలోని బీచ్‌మహల్లా బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ బోధనకు ఉపాధ్యాయులు లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. దీంతోపాటు గంజ్‌ హైస్కూల్‌, బాగాయత్‌ స్కూళ్లలో వాలంటీర్లు ఉన్నప్పటికీ విద్య సక్రమంగా విద్యార్థుల దరికి చేరడం లేదు. దీనికితోడు వేలాపాలా లేని విద్యుత్‌ కోతతో తరగతులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

కంప్యూటర్‌ విద్యకు దూరం

పట్టణంలోని ఐదు ఉన్నత పాఠశాలల్లో సుమారు వేయి మందికి పైచిలుకు విద్యార్థులు కంప్యూటర్‌ విద్యకు దూరమవుతున్నారు. 2009 ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలులో ఉన్నప్పటికీ అందరికి నాణ్యమైన సమానమైన విద్య అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. కాంట్రాక్టు పద్ధతి ద్వారా ఉపాధ్యాయులను నియమించినప్పటికీ వారికి సరైన వేతనాలు చెల్లించకపోవడంతో రెండు వారాలుగా పాఠశాలకే హాజరు కావడం లేదు. ఒక్క జూనియర్‌ కళాశాల ఆవరణలో గల ఉన్నత పాఠశాలలో వాలంటీర్లను నియమించుకుని విద్యార్థులకు అడపాదడపా కంప్యూటర్‌ విద్య కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్‌ ఉపాధ్యాయులను నియమించి పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యకు అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థిసంఘాల నాయకులు, విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు.

కంప్యూటర్‌ నేర్చుకోవాలని ఉంది : అనిమల్ల రత్నమాల(విద్యార్థిని)

నేను భవిష్యత్‌లో సైంటిస్టు కావాలని అనుకుంటున్నానని విద్యార్థి అనిమల్ల రత్నమాల పేర్కొంది. మాది పేద కుటుంబం. ప్రయివేట్‌ బడిలో చదివే స్థోమత లేదు. మా స్కూళ్లోనే కంప్యూటర్‌ నేర్పుతారని సంతోషపడ్డాను. సదువు చెప్పే సార్‌ జీతం ఇస్తలేరని రావడం లేదు. కంప్యూటర్‌ నేర్చుకుంటలేము.

కంప్యూటర్‌ చాలా అవసరం : ఎస్‌ఎఫ్‌ఐ

కంప్యూటర్‌ విద్య ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులు కొంతవరకు చదువులో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం రెండు చేతులు కట్టిపడేసి అన్నం తిను అన్నట్లుగా వ్యవహరిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌కార్యదర్శి జక్కి నగేశ్‌ విమర్శించారు. వెంటనే విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

కార్మిక, ఉద్యోగ పోరాటాలకు బాసట

  • హమాలీ, సిమెంట్‌ కార్మికుల పక్షాన ఉద్యమాలు - 108,104, కంప్యూటర్‌ టీచర్ల సమ్మె ఒప్పందాలు - చట్ట సభల్లో కార్మికుల గొంతుక - ప్రజాశక్తితో ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగం నిర్వీర్యం చేయబడుతున్నది. ప్రభుత్వ శాఖల్లో నియామకాలన్నీ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో చేస్తున్నారు. వీరికి ఏ రకమైన సదుపాయాలూ ఉండవు. ఇక ప్రయివేట్‌ రంగంలో కార్మిక చట్టాలను కాలరాస్తున్నారు. కార్మిక వర్గం తమ వేతనాలు, సదుపాయాల కోసం పోరాడుతూనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైనా ఉద్యమాల్లో పాల్గొంటుంది. ఆ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం, చట్ట సభల్లో కార్మిక గొంతుకై మాట్లాడడం, ప్రభుత్వంతో చర్చించి ఒప్పందాలు, జీవోలు, చట్టాలు అమలయ్యే విధంగా కృషి కొనసాగింది'. అని కార్మిక నాయకులు, సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సిఐటియు రాష్ట్ర 13వ మహాసభల సందర్భంగా ఆయన ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్య్వు ఇచ్చారు. ఆ వివరాలు ...

అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది కార్మికులు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బీమా వంటి సదుపాయాలకు నోచుకోవడం లేదు. ఏళ్ల తరబడి వారితో వెట్టి చేయించుకుంటున్నారు. నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కార్మికులను సంఘటితం చేసి అనేక పోరాటాలు నిర్వహించాం. జిల్లాలో అత్యధికంగా ఉన్న సిమెంట్‌ పరిశ్రమల కార్మికుల సమస్యల పరష్కారం కోసం సిఐటియు సమరశీల పోరాటాలు నడిపింది. ఈ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా కేసుల పాలై జైళ్లకెళ్లాల్సి వచ్చింది. దక్కన్‌, రాశి (ఇండియా), జువారీ, ప్రియా, కాకతీయ, ఎన్‌సిఎల్‌ సిమెంట్‌ పరిశ్రమల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు వేతనాల పెంపు, సదుపాయాల కల్పన కోసం సమ్మెలు చేశారు. దక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమలో సుదీర్ఘ కాలం సమ్మె నిర్వహించారు. ఆ సమ్మె పోరాటంలో ఎమ్మెల్యేగా ప్రత్యక్షంగా పాల్గొన్నాను. యాజమాన్యాలు, అధికారులపై ఒత్తిడి తెచ్చి కార్మికుల సమస్యల్ని పరిష్కరించేలా చేశాం. పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ ఆరు మాసాల పాటు పోరాడారు.

ఫలితంగా కార్మికుల వేతన ఒప్పందాలు జరిగాయి. సిమెంట్‌ కార్మికులకు వేజ్‌ బోర్డు లేకపోవడంతో వేతనాల కోసం ప్రతి ఒకటి, రెండేళ్లకు పోరాటాలు చేయాల్సి వస్తుంది. సిమెంట్‌ పరిశ్రమల్లో కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారు. ఆసియా ఖండంలోనే అత్యధికంగా రైస్‌ మిల్లులు నల్గొండ జిల్లాలో ఉన్నాయి. వీటిల్లో పనిచేసే వేలాది మంది హమాలీలకు కనీస వేతనాల్లేవు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌ వంటి సదుపాయాలూ లేవు. వాటి సాధన కోసం కార్మికుల్ని సంఘటిత పర్చి మిల్లు యజమానులపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగా రెండేళ్లకో సారి వేతనాలు పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. జిల్లాలో ఇతర రాష్ట్రాల నుండి వలసొచ్చిన కార్మికులు అధికంగా ఉన్నారు. వీరి పరిస్థితి దుర్భరంగా ఉంది. కార్మిక సంఘాల్లో చేరితే భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు. వీరు ప్రమాదాలకు గురైతే యజమానులు పట్టించుకోవడం లేదు. వారి పక్షాన సిఐటియు పోరాడి నష్ట పరిహారం ఇప్పిస్తుంది.

ఎఫ్‌సిఐ, బజారు, గ్రామీణ హమాలీల సంఖ్య కూడా అధికంగా ఉంది. ఈ రంగాల్లో సొసైటీలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు సాగాయి. వీరితో పాటు మోటారు వాహన కార్మికుల సంఖ్య కూడా జిల్లాలో గణనీయంగా ఉంది. వీరి సమస్యలపై ఆందోళనలు నిర్వహించడం, అధికారులతో చర్చించి సంక్షేమ పథకాలు వర్తించేలా కృషి జరిగింది. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, గ్రామ సేవకుల పోరాటాల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు వారి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన ఫలితంగా కొన్ని జీవోలు జారీ చేయబడ్డాయి. వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులు, కార్మికుల సమస్యలపై నిర్వహించిన ఆందోళనల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

అసంఘటిత రంగం కార్మికులతో పాటు ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగుల పోరాటాలను చట్ట సభల్లో ప్రతిబింబించేందుకు కృషి జరిగింది. ముఖ్యంగా 104, 108, కంప్యూటర్‌ టీచర్స్‌ ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన సమ్మెలు విజయవంతమయ్యాయి. 104,108 వాహనాలను ప్రభుత్వమే నడపాలని నిర్వహించిన సమ్మెకు ప్రభుత్వం దిగొచ్చింది. తొలగించిన ఉద్యోగుల్ని మళ్లీ తీసుకున్నారు. వీరి పోరాటాలకు శాసన సభ్యునిగా మద్దతు తెలిపాను. ప్రత్యక్షంగా పోరాట కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మంత్రులు, ముఖ్యమంత్రితో చర్చలు జరిపి సమ్మె ఒప్పందాలు అమలు జరిగేలా చూశాం. కంప్యూటర్‌ టీచర్లు పదివేల మంది సుదీర్ఘ కాలం- 2011 సెప్టెంబర్‌ నుండి డిసెంబర్‌ 29 వరకూ సమ్మె చేశారు. వారి సమ్మెకు మద్దతుగా నిలిచి కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ వేతనాలు పెంచేలా ఒత్తిడి తెచ్చాం. ప్రభుత్వ పరంగా కూడా కంప్యూటర్‌ టీచర్ల సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్చించాం. కార్మిక చట్టాలను సవరిస్తూ యజమానులకు అనుకూలంగా చేస్తున్నారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల ప్రభావాలు కార్మిక, ఉద్యోగ వర్గంపై అధికంగా ఉన్నాయి. వీటిని ప్రతిఘటిస్తూ పోరాడాల్సి ఉంది. ప్రజల్ని కలుపుకొని ఉద్యోగులు, కార్మికవర్గ ఐక్య పోరాటాలు మరింత పట్టిష్టంగా జరగాల్సి ఉంది.

కనీసవేతనాలివ్వకుండా శ్రమ దోపిడీ

కనీస వేతనాలు, సెలవులు, ఇతర సౌకర్యాలు కల్పించకుండా కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలను ప్రభుత్వం కొల్లగొడుతోంది. కేవలం గౌరవ వేతనాలు ఇస్తూ, శాశ్వత ఉద్యోగులు చేసే పూర్తి పనిని చేయిస్తూ శ్రమదోపిడీకి గురిచేస్తోంది. అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నా నేటికీ ప్రభుత్వం వీరిని రెగులైజేషన్‌ చేయలేదు. పశ్చిమ బెంగాల్‌ల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తూ 2010లో అప్పటి వామపక్ష ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సెలవులు, మెటర్‌నిటీ సౌకర్యాలు కల్పించింది. తమిళనాడులో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోలేదు. సుప్రీం కోర్టు తీర్పులనూ అమలు చేయడంలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6నెలలకు డిఎ పెరుగుతున్నా వీరికి అలాంటివేమీ లేవు. అందుకే ప్రభుత్వం వివిధ శాఖల్లో భర్తీచేసే ఉద్యోగాల్లో వీరినే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వంపై సిఐటియు లాంటి కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు జిల్లా పర్యటన నిర్వహిస్తున్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఇద్దరు కంప్యూటర్‌ టీచర్లను నియమించారు. కేంద్ర నిధులతో నడపబడుతున్న దీనితో నేటికి రూ.2300 మాత్రమే చెల్లిస్తున్నారు. జిఓ 3 ప్రకారం రూ.10వేలు చెల్లించాల్సి ఉన్నా పట్టించుకునే దిక్కులేదు. అందుకే ప్రభుత్వం మధ్య దళారీలను తొలగించి పూర్తి వేతనం ఇవ్వాలి. ఒప్పందాలను అమలు చేయాలి.

- సిహెచ్‌ కాంచన, కంప్యూటర్‌ టీచర్‌

పనిభారంతో సతమతం

రెవెన్యూ డిపార్టుమెంట్‌లో జిల్లాలో 52మంది కంప్యూటర్‌ ఆపరేటర్లగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం మాకు టైపిస్టు శాలరీతో సరిపుచ్చుతోంది. ఉద్యోగ భద్రతలేదు. పనిభారం ఎక్కువైంది. అయినా రెగ్యులరైజ్‌ చేయడంలేదు. ఈ పరిస్థితిని ప్రభుత్వం మార్చాలి.

-ప్రసాద్‌, రెవెన్యూ ఉద్యోగి

ప్రభుత్వ కళాశాలలకు వచ్చే ఏడాదినుండి కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం

  • జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బస్వరాజు సారయ్య

వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ కళాశాలలకు కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డిగ్రీ, జూనియర్‌ కళాశాలలో స్కాలర్‌షిప్‌ వెరిఫికేషన్‌ గురించి సంబంధిత శాఖల అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్‌ మంత్రికి వివరించారు. కంప్యూటర్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్‌లో కొంత ఆలస్యం జరుగుతుందని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో డిగ్రీ కళాశాలలో 52శాతం, జూనియర్‌ కళాశాలల్లో40శాతం మాత్రమే వెరిషికేషన్‌ పూర్తయిందని మిగితావి వారంరోజుల్లోగా పూర్తిచేయాలని అన్నారు. అలాగే బోగస్‌ సర్టిఫికెట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఇప్పటి వరకు రూ.47కోట్ల 62లక్షలు స్కాలర్‌షిప్‌ నిధులు విడుదలయ్యాయని అందులో అందులో రూ.40కోట్లు ఖర్చుచేశామని అన్నారు.స్కాలర్‌షిప్‌లను అకౌంట్‌ ద్వారా అందిస్తున్నందున బ్యాంకర్లు విద్యార్థుల ఖాతా తెరవడంతో ఇబ్బందులు ఏర్పడకుండా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. స్కాలర్‌షిప్‌ల బిల్లులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే కళాశాలల గుర్తింపును రద్దుచేస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌ మాట్లాడుతూ 2011-12 సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 115 డిగ్రీ, పిజి కళాశాలలు, 138 జూనియర్‌ కళాశాలల ద్వారా స్కాలర్‌షిప్‌ కోసం 75,169 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వాటిని వారంరోజుల్లోగా పూర్తిచేస్తామని తెలిపారు. ఎపి ట్రైకార్‌ ఎండి పద్మ మాట్లాడుతూ కళాశాలలో స్కాలర్‌షిప్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపించేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఫిబ్రవరి మొదటివారంలోనే స్కాలర్‌సిప్‌ డబ్బులు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎజెసి వీరమల్లు, సాంఘీక సంక్షేమశాఖ ఆర్‌.డి అలోక్‌కుమార్‌, డి.డి సోషల్‌ వెల్ఫేర్‌ ఎ.శంకర్‌, జిల్లా బిసి వెల్ఫేర్‌ అధికారి కోటిలింగం, డి.డి ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వేశ్వర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి సాంబశివరావు, కళాశాలల ప్రిన్సిపాల్లు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దయనీయ స్థితిలో కంప్యూటర్‌ ఆపరేటర్లు

  • ఇచ్చే జీతం తక్కువ... నెలనెలా అందవు
  • అధికారుల నిర్లక్ష్యంతో పడకేసిన కంప్యూటర్లు

సక్సెస్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందించాల్సిన కంప్యూటర్లు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా పడకేశాయి. వాటి నిర్వాహకులు కంప్యూటర్‌ టీచర్లకు నాలుగు నెలలుగా వేతనాలు అందించలేదు. టీచర్లను పట్టించుకునే నాథుడే కరువైయ్యాడు. మండలంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాల సమస్యలపై కథనం...

కీసర మండలంలోని కీసర, రాంపల్లి, చీర్యాల, కుషాయిగూడ, నాగారం, కాప్రా తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కంప్యూటర్‌ టీచర్లను నియమించింది. విద్యార్థులకు కంప్యూటర్‌ గురించి వివరిస్తున్నామన్న సంతోషం ఉన్నప్పటికీ చాలీచాలని జీతాలతో కంప్యూటర్‌ టీచర్లు కాలం వెళ్లదిస్తున్నారు. ప్రస్తుతం రూ.2500లతో బతుకుబండిని లాగుతున్నారు. పెంచిన ధరలు, ఆకాశనంట్టుతున్న తరుణంలో సామాన్యులు బతకలేని స్థితిలో వీరి పరిస్థితులు ఉన్నాయి. పాలకులు, అధికారుల దృష్టికి పలుమార్లు జీతాలు పెంచాలని వినతిపత్రాలు అందజేసిన ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 100శాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రభుత్వం పేర్కొంటుండగా... చదువులో భాగమైన కంప్యూటర్‌ టీచర్లు పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని పలువురు కంప్యూటర్‌ టీచర్లు కోరుతున్నారు.

ఏం సరిపోవడం లేదు : వెంకటేష్‌, నాగారం, కంప్యూటర్‌ టీచర్‌

మూడు సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు కంప్యూటర్‌ మెలకువలు నేర్పిస్తున్నప్పటికీ తృప్తి మాత్రమే మిగిలింది. కానీ, ప్రభుత్వం ఇస్తున్న జీతాలు ఏం సరిపోవడం లేదు. వచ్చే జీతంతో బజారుకు వెళ్లి ఏట్లా బతుకుతాం

పిఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలి

: ఎం. గ్రేసిమేరి దమ్మయిగుడా, కంప్యూటర్‌ టీచర్‌

కుటుంబ పోషణకు వచ్చే జీతం రూ.2500 ఏమీ సరిపోవడంలేదు. దీనిపైనే ఆధారపడి పిల్లలకు కంప్యూటర్‌ పాఠాలు బోధిస్తున్నాం. నిత్యవసర ధరలు పెరుగుతున్నప్పటకీ కంప్యూటర్‌ టీచర్లకు మాత్రం వేతనాలు పెరగడం లేదు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలి.

అధికారులు స్పందించాలి : స్వరూప, కీసర, కంప్యూటర్‌ టీచర్‌

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్‌ పాఠాలు వివరిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చాడానికి విశేషంగా కృషిచేస్తున్నాం. అయినా నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించాలి.

4నెలలుగా జీతాలు లేవు : రేణుక, కీసర, కంప్యూటర్‌ టీచర్‌

కంప్యూటర్‌ టీచర్లకు 4నెలలుగా జీతాలు లేవు. ప్రతినెలా వస్తేనే సమస్యలు తీరవు అలాంటి మాకు నాలుగు నెలలుగా జీతాలు రాకపోతే ఏట్లా గడిచేది?. సమస్యను తోందరగా పరిష్కరించాలి.

సమస్యల నడుమ కంప్యూటర్‌ టీచర్లు

  • రవేతనాలు అందక అవస్థలురఅమలుకాని ప్రభుత్వ హామీలు

జిల్లా వ్యాప్తంగా 422 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2008-09 విద్యా సంవత్సరంలో 381 పాఠశాలలను సక్సెస్‌ పాఠశాలలుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 321 పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెట్టింది. దీంతో పాటు 91 ప్రాథమికోన్నత పాఠశాలను 59 పాఠశాలల్లో విలీనం చేశారు. మొత్తం పాఠశాలలను ఏడు జోన్లుగా విభజించి కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన బోధకులను పాఠశాలకు ఇద్దరు చొప్పున కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. జిల్లా వ్యాప్తంగా కంప్యూటర్‌ టీచర్లు ఎడుకం సొల్యుషన్‌ కంపెనీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పద్ధతిలో 642 మంది నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నెలకు వేతనం రూ.2,600 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇందులో రూ.124లు పిఎఫ్‌ కింద మినహాయిస్తున్నారు. పిఎఫ్‌కు జమచేసినట్టు ఎలాంటి పత్రాలు ఇవ్వడం లేదు. మూడేళ్లుగా ప్రభుత్వం తమకు వేతనాలు పెంచుతుందన్న నమ్మకంతో టీచర్లు పని చేశారు. చివరకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షలకు దిగిన సంగతి విదితమే. దీక్షలకు స్పందించిన ప్రభుత్వం కంప్యూటర్‌ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. వీరికి జీవో నెంబరు 3 ప్రకారం కనీస వేతనాలు మంజూరు చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చాలీచాలని వేతనాలతో బతుకీడుస్తున్నారు. ఇచ్చే అరకొర వేతనం కూడా 8 నెలలుగా ఇవ్వడం లేదు. గతంలో తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్‌ ఎదుట 125 రోజులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు స్పందించిన ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. గత సంవత్సరం 28వ తేదీన హైదరాబాద్‌లో ఎడుకం సొల్యూషన్‌ కంపెనీ యజమాన్యంతో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. గుర్తింపుకార్డులు, యూనిఫాములు ఇస్తామని, దీక్షలో ఉన్న వారికి ఐదు నెలల వేతనాలు చెల్లిస్తామని కంపెనీ యాజమాన్యం అగ్రిమెంట్‌ చేసుకుంది. దీంతో కంప్యూటర్‌ టీచర్లు విధులకు హాజరయ్యారు. ఇంత వరకు 8 నెలలు కావస్తున్నా వేతనాలు ఇవ్వలేదు.

బకాయి వేతనాలు చెల్లించాలి...

కంప్యూటర్‌ టీచర్లకు 8 నెలలుగా బకాయిపడ్డ వేతనాలు తక్షణమే చెల్లించాలి. జీవో నెంబరు 3 ప్రకారం టీచర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి. పిఎఫ్‌, ఇఎస్‌ఐ వర్తింపజేయాలి. మహిళా బోధకులకు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతినెలా ఒకటో తేదీకి వేతనాలను బ్యాంకుల ద్వారా చెల్లించాలి. జీవో 4459 ప్రకారం 15 క్యాజువల్‌ లీవ్‌లు, 120 రోజుల మెటర్నిటీ లీవుల సౌకర్యం కల్పించాలి. వేసవి సెలవుల్లో వేతనాలు చెల్లించాలి. కంప్యూటర్‌ ఫ్యాకల్టీలను కంప్యూటర్‌ టీచింగ్‌కు మాత్రమే వినియోగించాలి. నాన్‌టీచింగ్‌ పనులకు కేటాయించరాదు. సిస్టమ్స్‌ నిర్వహణ రెగ్యులర్‌గా సక్రమంగా చేయించాలి.

(కంప్యూటర్‌ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణగౌడు)

కష్టాల్లో కంప్యూటర్‌ బోధకులు

జిల్లాలోని సక్సెస్‌ పాఠశాలల్లో పని చేస్తున్న కంప్యూటర్‌ ఉపాధ్యాయులు ఎనిమిది నెలలుగా వేతనాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కేవలం 2,600 రూపాయల వేతనం అందించడంతో చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారిందని వారు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమకు అందించేవేతనాన్ని రూ. 5000లకు పెంచాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, మహిళలకు ప్రసూతి సెలవులు, క్యాజువల్‌ సెలవులతో పాటు ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది సెప్టెంబర్‌ 15 నుండి డిసెంబర్‌ 31 వరకు సమ్మె చేపట్టగా డిసెంబర్‌ 31న ప్రభుత్వం స్పందించి హామీలు ఇచ్చి ఇప్పటికీ పరిష్కరించలేకపోతోందని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ నుండి ప్రస్తుత ఏప్రిల్‌ వరకు పెరిగిన వేతనం కాదు కదా అంతకుముందు అమలులో ఉన్న వేతనం కూడా రాక నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని కంప్యూటర్‌ ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎక్కడెక్కడో అప్పులు చేసి కాలాన్ని వెళ్లదీస్తున్నామని వారు వాపోయారు. ఈ సక్సెస్‌ పాఠశాలల్లో కంప్యూటర్‌ ఉపాధ్యాయులుగా పేరు చెప్పుకోవడానికే సరిపోతోందని, దీని వల్ల ఇతర పనులు చేయలేక చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబపోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఏజెన్సీల నిర్వాకం వల్ల జిల్లాలో పని చేస్తున్న 444 మంది కంప్యూటర్‌ ఉపాధ్యాయులు వీధిన పడే రోజు దగ్గరకు వచ్చిందని వారు వాపోయారు. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని, ఇకనైనా ప్రభుత్వం తమ దీనగాథను అర్థం చేసుకొని రావాల్సిన 8 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించకపోతే జూన్‌ 12 నుండి ప్రారంభమయ్యే పాఠశాలల్లో విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న కంప్యూటర్‌ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.

ప్రభుత్వం ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లే : దుగుట శ్రీనివాస్‌, కంప్యూటర్‌ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు

ప్రభుత్వం, ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లే మాకీ దుస్థితి ఏర్పడింది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వేతనాలు చెల్లించి మా జీవితాలు వీధిపాలు కాకుండా చూడాలి. అలాచేయని పక్షంలో మళ్లీ ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.