H1

కంప్యూటర్‌ టీచర్ల పోరాట విజయం

కంప్యూటర్‌ టీచర్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. పోరాడితే తప్ప ఏ సమస్య పరిష్కారం కాని స్థితి రాష్ట్రంలో ఏర్పడిందంటే దానికి ఈ బధిరాంధ సర్కారే కారణం. కాంట్రాక్టు అధ్యాపకులు, రెండవ ఎఎన్‌ఎమ్‌లు పోరాడితే గానీ వారి సమస్యలు పరిష్కారం కాలేదు. 104 సిబ్బంది ఆందోళనకు దిగి వంద రోజులు దాటినా ప్రభుత్వంలో కదలిక లేదు. కంప్యూటర్‌ టీచర్లు 105 రోజులు సమ్మె చేస్తే తప్ప వారి కనీస డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. అప్పిచ్చిన ప్రపంచబ్యాంకు షరతుల అమలు విషయంలో ఎక్కడ లేని ఆతృత కనబరిచే ఈ సర్కార్‌కి, ఆ విధానాల పర్యవసానంగా సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి సారించడానికి తీరిక లేదు. కంప్యూటర్‌ టీచర్ల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి ఇన్ని రోజుల వ్యవధి పట్టిందంటే ఏమనుకోవాలి? వారి డిమాండ్లలో గొంతెమ్మ కోర్కెలు ఏమీ లేవు. ప్రభుత్వమే జారీ చేసిన జివో నెం. 3 ప్రకారం కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉపాధ్యాయులకు వర్తించే సెలవులన్నీ తమకూ వర్తింపజేయాలని, అదనపు పని గంటలకు అదనపు వేతనం చెల్లించాలని, కంప్యూటర్‌ విద్యను పాఠ్యాంశంలో భాగంగా చేర్చాలని మాత్రమే వారు కోరారు. ఇందులో నిర్హేతుకమైన డిమాండ్‌ ఒక్కటి కూడా లేదే? అయినా, ఈ డిమాండ్ల సాధనకు కంప్యూటర్‌ టీచర్లు 105 రోజులు సమ్మె చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం ఎందుకు కల్పించినట్లు? ఈ డిమాండ్లను మొదట్లోనే అంగీకరించి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ప్రభుత్వ స్కూళ్లకు చెందిన 12 వేల మంది కంప్యూటర్‌ టీచర్లు ఇలా వీధికెక్కాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, పరీక్షల సమయం దగ్గర పడుతున్నా కంప్యూటర్‌ కోర్సు మొదలు కాక విద్యార్థులు ఆందోళనకు గురయ్యే పరిస్థితీఉత్పన్నమయ్యేది కాదు.

కంప్యూటర్‌ టీచర్లు పోరాడిన ఫలితంగానే జీతంలో రు. 400 నుండి రు.800 వరకు పెంపుదల లభించింది. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, సెలవులు వంటి సౌకర్యాలను సాధించుకోగలిగారు. వచ్చే జూన్‌లో 5వేల రూపాయల బేసిక్‌ వేతనం కలిగిన కంప్యూటర్‌ టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో వీరికి ప్రాధాన్యత ఇచ్చేందుకు, అదనపు పని గంటలకు అదనపు వేతనం చెల్లించేందుకు అంగీకరించడం, సమ్మెకాలాన్ని అదనపు పని గంటల రూపంలో భర్తీ చేయాలన్న షరతుపై సమ్మె కాలానికి వేతనాలు చెల్లించేందుకు అంగీకరించడం ఇవన్నీ కంప్యూటర్‌ టీచర్ల పోరాటానికి లభించిన విజయమనే చెప్పాలి. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను అమలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ సమాచార, సాంకేతిక పరిజ్ఞానం (ఐసిటి) పథకం లక్ష్యం నెరవేరాలంటే మైక్రో సాఫ్ట్‌ వంటి కంపెనీలకు లాభాలు చేకూర్చే వైఖరి నుంచి ప్రభుత్వం మొదట బయటపడాలి. అధిక ఖర్చుతో కూడిన మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు బదులు లయనెక్స్‌ వంటి ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను ఈపథకంలో ఉపయోగిస్తే కోట్లాది రూపాయలు ఆదా అవుతుంది. ఆ విధంగా ఆదా అయిన సొమ్మును మౌలిక సదుపాయాల కల్పన, కంప్యూటర్‌ టీచర్ల కనీస వేతనాలు ఇచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. కేంద్రం, రాష్ట్రం 75:25 నిష్పత్తిలో నిధులు సమకూర్చుతున్న ఈ 550 కోట్ల ప్రాజెక్టుకు టెండర్లు పిలిచినప్పుడే కంప్యూటర్‌ టీచర్ల జీతాలకు అవసరమైన నిధులను నిర్దిష్టంగా పేర్కొనడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో కంప్యూటర్‌ ల్యాబ్‌, ఇతర పరికరాలకే నిధులు ఆవిరైపోయాయి. కేంద్రం ఎనిమిది మాసాల క్రితమే నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతరత్రా రంగాలకు మళ్లించడం వల్ల కాంట్రాక్టు ఏజెన్సీలు కంప్యూటర్‌ టీచర్లకు ఏడు త్రైమాసికాల నుంచి జీతాలు చెల్లించడం లేదు. అరకొర వేతనాలు చెల్లించి వెట్టి చాకిరీ చేయించుకోవడంపైనే ప్రభుత్వం ఆసక్తి చూపింది.ఏనుగులు దూరే కంతలను వదిలి చీమలు దూరే రంధ్రాలపై దృష్టి పెట్టడంలో పాలకుల వర్గ స్వభావం స్పష్టంగా వెల్లడవుతోంది. న్యాయమైన వేతనాలు ఇవ్వలేక కాదు. ఇవ్వకూడదనే దుర్మార్గపు ధోరణే దీనికి కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ధోరణిని మార్చుకోవాలి. ఆదర్శ యజమానిగా వ్యవహరించాలి. గోవాలో కంప్యూటర్‌ టీచర్లు పోరాడి తమ నెలసరి వేతనాన్ని అంచెలంచెలుగా రు.4,500కి పెంచుకున్నారు. ఇక్కడలాగే అక్కడ కూడా మొదట కాంట్రాక్టు ఏజెన్సీల ద్వారా కంప్యూటర్‌ నియామకాలు జరిగినా, తరువాత ఈ నియామకాల ప్రక్రియ విద్యా శాఖ చేపట్టింది. ప్రభుత్వ స్కూళ్ల కంప్యూటర్‌ టీచర్ల సర్వీసులను దశలవారీగా రెగ్యులరైజ్‌ చేస్తున్నది. పంజాబ్‌లో కూడా కంప్యూటర్‌ టీచర్లు పోరాడి కొన్ని సౌకర్యాలు సాధించుకున్నారు. మన రాష్ట్రంలో కంప్యూటర్‌ టీచర్లు పోరాడి కొన్ని హక్కులు సాధించినా, ఇంకా సాధించాల్సింది చాలా వుంది. కేరళ, గోవా తరహాలో మన రాష్ట్రంలో కూడా కంప్యూటర్‌ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కంప్యూటర్‌ విద్యను కంపల్సరీ పాఠ్యాంశంగా చేర్చి ప్రస్తుతం అమలు చేస్తున్న 5వేల స్కూళ్లకే గాక మిగతా1300 ప్రభుత్వ స్కూళ్లకు విస్తరింపజేయాలి. కార్మిక శాఖ, విధాన మండలి సూచించినట్లు కంప్యూటర్‌ టీచర్ల నెలసరి వేతనం కనీసం రు.6వేలు ఉండేలా చూడాలి.అలాగే వివిధ స్కూళ్లలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ప్రస్తుతం హైస్కూళ్లకు, కళాశాలకు మాత్రమే పరిమితమైన కంప్యూటర్‌ విద్యను ప్రాథమిక విద్యకు కూడా విస్తరింపజేయాలి. సమాచార సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు తగినట్లుగా మన విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకునేందుకు ప్రతి స్కూలుకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవాలి. ఇందుకోసం మరో పోరాటం అవసరం.

105' విజయం    కంప్యూటర్‌ టీచర్లు సమ్మె విరమణ

  • కంప్యూటర్‌ టీచర్లు సమ్మె విరమణ

ప్రజాశక్తి - కాకినాడ

కనీస వేత నాలు, ఉద్యోగ భద్రత కోరుతూ కంప్యూటర్‌ టీచర్లు చేపట్టిన 105 రోజుల సమ్మె విజయ వంతమైంది. దీంతో వారు గురు వారంసమ్మె విరమిం చారు. ఈ సంద ర్భంగా వారు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తొలుత కంప్యూటర్‌ టీచర్ల జిల్లా సమావేశం స్థానిక సుందరయ్య భవనంలో సిఐటియు జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేల 600 మంది కంప్యూటర్‌ టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి 105 రోజుల సమయం పట్టిందన్నారు. లక్షల్లో ఉన్న రైతులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చేందుకు ఎన్నివేల సంవత్సరాలు కావాల్సి ఉంటుందోనని విమర్శించారు. డిగ్రీ చదివి కంప్యూటర్‌ ప్రొగ్రాం కోర్సు చేసిన యువతకు కనీస వేతనం అమలు చేయడానికి ప్రభుత్వా నికి చేతులు రాలేదని అన్నారు. అదే సమయంలో ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎంఎల్‌ఎల వేతనాలు లక్షల్లో పెంచుకునేందుకు సిగ్గు వేయడం లేదా అని విమర్శించారు. కంప్యూటర్‌ టీచర్లు రెగ్యులర్‌ అయ్యేంతవరకు పోరాటాన్ని వివిధ రూపాల్లో కొనసాగించాలని పిలుపునిచ్చారు. 105 రోజుల పాటు సమ్మెకు సహకరించిన ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, యుటిఎఫ్‌ సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియజేశారు. కంప్యూటర్‌ టీచర్స్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు కె.మురళీ మాట్లాడుతూ కలిసి కట్టుగా పోరాడటం వల్లే విజయం సాధించగాలిగామన్నారు. ప్రభుత్వం సమక్షంలో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలతో కంప్యూటర్‌ సంఘ ప్రతినిధులతో ఒప్పందం జరిగిందన్నారు. జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ అనేక సమస్యలను ఎదుర్కొని, ఎదురౌతున్న ఆటంకాలను అధిగమించి విజయం సాధించిన కంప్యూటర్‌ టీచర్లకు తమ శు భాకాంక్షలు తెలియజేశారు. సమ్మె సందర్భంగా పెరిగిన వేతనం జిఓ ప్రకారం కాకపోయినప్పటికీ ఈపోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేపట్టేందుకు కంప్యూటర్‌ టీచర్లు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సమ్మె కాలంలో తన సహకారాన్ని అందించిన మీడియాకు కంప్యూటర్‌ టీచర్ల సంఘం జిల్లా కమిటీ తమ ధన్యవాదాలు తెలిపింది. రానున్న కాలంలో ఇటువంటి సహకారాన్ని అందించాలని వారు కోరారు.

 

అభద్రతలో అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు ఉద్యోగులు

కొడవలూరు మండలం నార్తురాజుపాళెం హైస్కూల్‌లో ఎన్‌.శైలజ కంప్యూటర్‌ టీచరు. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆమెకు భర్తతోపాటు అత్తమామలూ ఉన్నారు. నెలకు జీతం కేవలం రెండు వేలే... అది చాలక కుటుంబాన్ని పోషించలేక నానా అవస్థలు పడుతున్నారు..
వెంకటాచలం మండలం సర్వేపల్లి హైస్కూల్‌లో మస్తానయ్య కంప్యూటర్‌ టీచరు. ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు అమ్మానాన్నలతోపాటు ఒక చెల్లెలు ఉంది. ఇచ్చే రెండు వేల జీతం చాలక అప్పుల పాలయ్యాడు.. గత్యంతరం లేక ఆ వృత్తిలోనే కొనసాగుతున్నారు..
సంగం మండలం కోలగట్ల గ్రామానికి చెందిన అమరనాథ్‌ రెడ్డి ఉపాధి పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌. నెలకు జీతం 2,600. చాలీచాలని ఆ జీతంతో కుటుంబాన్ని నెట్టుకుస్తున్నారు..
జిల్లాలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సమస్యల వలయంలో చిక్కుకుని అల్లాడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడో పర్మినెంట్‌ ఉద్యోగుల నియామకాలకు చెల్లుచీటి పలికింది. వారి స్థానంలో ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించింది. విద్యావాలంటీర్లు, యూనివర్శిటీ ప్రొఫెసర్స్‌, సిరీ, ఉద్యావన, అటవీశాఖ, మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, మెడికల్‌ అండ్‌హెల్త్‌, సాంఘిక సంక్షేమ శాఖలోని పలువురు సిబ్బంది, లెక్చరర్స్‌, కంప్యూటర్‌ టీచర్లు కాంట్రాక్టు ఉద్యోగులుగా జీవనం సాగిస్తున్నారు. ఆయా శాఖల్లోని అందరి ఉద్యోగులకు సరిపడా వేతనాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఉదా: జిల్లాలో విద్యావాలంటీర్ల స్థితి పరిశీలిస్తే.. 1995 దాకా ఉపాధ్యాయ పోస్టు వస్తే హాయిగా జీవితం సాగిపోతుందని అభ్యర్థులు భావించారు. ప్రభుత్వం 1996లో విద్యావాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దాంతో భావి ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఉపాధ్యాయ పోస్టులను సక్రమంగా భర్తీ చేయకుండా వారి స్థానంలో వాలంటీర్లను తీసుకోవడం మొదలు పెట్టింది. వారు సంవత్సరంపాటు పనిచేసేలా ఒప్పందం చేసుకోసాగింది. వాలంటరీర్లు తర్వాత విద్యా సంవత్సరానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడం రివాజుగా మారిపోయింది. అయినా వారి వేతనాలు భేషుగ్గా ఉన్నాయంటే అదీ లేదు. ఈ వ్యవస్థ ప్రారంభంలో వాలంటరీకి నెలకు వెయ్యి రూపాయల జీతమొచ్చేది. ఆ తర్వాత రెండు వేలు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎస్‌జిటి అభ్యర్థులకు మూడు వేలు, బిఇడి అభ్యర్థులకు నాలుగు వేలు జీతం ఇస్తున్నారు. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ధరలతో పోల్చితే ఆ జీతం ఏమాత్రం సరిపోదు. అదీ నెలనెలా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తుందంటే వారి గుండెల్లో రైళ్లు పరిగెడ్తుంటాయి. ఎందుకంటే మళ్లీ కొత్తగా ఉద్యోగం వస్తుందో రాదోనని. దాని కోసం ఏ రాజకీయ నాయకుని కాళ్లు పట్టుకోవాలనే ఆలోచనలో పడిపోతారు. గతంలో జిల్లాలో 2700 మంది విద్యావాలంటీర్లు ఉన్నారు. రేషనలైజేషన్‌ పేరుతో ఆ సంఖ్య 1500కు తగ్గించారు. డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యావాలంటీర్ల సంఖ్యను యథాథంగా కొనసాగించాలని ఉద్యమించినా ప్రభుత్వం దిగిరాలేదు. ఉన్న ఆ సంఖ్యను ప్రభుత్వం ఎక్కడ కుదిస్తుందేమోనని వాలంటీర్లు దినదిన గండంగా కాలం వెలిబుచ్చుతున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు పోరాటం చేసిన ఫలితంగా జిల్లాలోని 600 మందికి ఇటీవల కాస్త న్యాయం జరిగింది. టైం స్కేల్‌ 8 వేలనుంచి 18030 రూపాయలకు పెంచారు. మళ్లీ ప్రభుత్వం వారిని తొలగించి పర్మినెంట్‌ లెక్చరర్స్‌ను నియమించేందుకు పూనుకోనుంది. దాంతో వారిలో ఆందోళన మొదలైంది. తమనే ఆ స్థానంలో నియమించాలని వారు డిమాండు చేస్తున్నారు. సెరీ, ఉద్యావన, అటవీశాఖ, మత్స్యశాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులు రెండు వేల మంది ఉన్నారు. వారికి జీతాలు సకాలంలో వస్తుండడంతో కొంత ఊరట చెందుతున్నారు. తమను రెగ్యులరైజేషన్‌ చేయాలని, పనిభద్రత కల్పించాలని కోరుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులైన ఎపిఓలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు సుమారు 1500 ఉన్నారు. వారికి పని గ్యారంటీ లేని పరిస్థితి. ఉన్నతాధికారుల, రాజకీయనాయకుల వేధింపులు అధికంకావడంతో నిత్యం వేదనకు గురవుతున్నారు. పనీ గ్యారంటీ లేదు.

ఐదేళ్ల క్రితం విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం నేర్పాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌ ద్వారా జిల్లాలోని 300 పాఠశాలల్లో 603మంది కంప్యూటర్‌ టీచర్లను నియమించింది. కాంట్రాక్టు పద్ధతి ద్వారా ప్రభుత్వమే జీతం నేరుగా మంజూరు చేస్తోంది. అవుట్‌సోర్సింగ్‌ అంటే ప్రభుత్వానికి, సిబ్బందికి మధ్య ఒక మధ్యవర్తి ఉంటారు. ఆ మధ్యవర్తి ద్వారా అవుట్‌సోర్సింగ్‌సిబ్బంది జీతాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం వారిచేత పనిమాత్రం చేయించుకుంటుంది. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, పెన్షన్‌, తదితర సౌకర్యాలను ప్రబుత్వం పట్టించుకోవడం లేదు. ఒక కంప్యూటర్‌ టీచర్‌కు రెండు వేల రూపాయల జీతం ఇస్తున్నారు. అది వారికి ఏమూలకూ సరిపోదు. అందువల్ల వారు తమకు రాష్ట్ర ప్రభుత్వ జిఓ 3, కేంద్ర ప్రభుత్వ జిఓ 6 ప్రకారం వేతనాలు చెల్లించాలని స్థానిక కలెక్టరేట్‌ ఎదుట సమ్మె చేస్తున్నారు. వారి సమ్మె శుక్రవారానికి వందో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం కేవలం 600 రూపాయలే పెంచింది. మధ్యవర్తిగా ఉన్న నిట్‌ కంపెనీకి ఇద్దరు టీచర్లకు కలిపి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 13,700 రూపాయలిస్తోంది. కానీ ఆ సంస్థ ఇద్దరు టీచర్లకు నాలుగువేలు, నిర్వహణకు మరో వెయ్యి రూపాయల మాత్రమే ఇస్తూ మిగతా సొమ్ము స్వాహా చేస్తోంది. అందువల్ల జిఓ 3 ప్రకారం 10300 లేదా జిఓ 6 ప్రకారం 6300 రూపాయల వేతనం ఇవ్వాలని కంప్యూటర్‌ టీచర్లు డిమాండు చేస్తున్నారు. జిఓ 3 ప్రకారం వేతనాలివ్వాలని గత సంక్రాంతి కానుక ఇస్తామని సిఎంప్రకటించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు.

 

ఉద్యోగుల హక్కులపై దాడి చేస్తే సహించం

  • సర్కారుకు ఎఐఎస్‌జిఇఎఫ్‌ హెచ్చరిక

  • ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపు

అనేక ఉద్యమాల ద్వారా ఉద్యోగులు, కార్మికులు సాధించుకున్న హక్కులపై దాడి చేస్తే సహించబోమని ఆదివారం ఇక్కడ ముగిసిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఎఐఎస్‌జిఇఎఫ్‌) 14వ జాతీయ మహాసభ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రధాన కార్మిక సంఘాలు ఫిబ్రవరి 28న జాతీయ స్థాయి సార్వత్రిక సమ్మెకు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని ఈ మహాసభ నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. ఉద్యోగులు సాధించుకున్న హక్కులపై దాడి చేసే లక్ష్యంతో అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలను ఉధృతం చేయాలని ఈ మహాసభ పిలుపునిచ్చింది. ఇంకా ఈ మహాసభలో పెన్షన్‌ నిధుల నియంత్రణా బిల్లును ఉపసంహరించాలని, ఖాళీగా వున్న 50 లక్షలకు పైగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, పార్ట్‌టైమ్‌, కాంట్రాక్ట్‌, దినసరి వేతనం, అడ్‌హాక్‌, నిర్ణీత వేతనాల పేర్లతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ పేరుతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ఈ మహాసభలు డిమాండ్‌ చేశాయి. దీంతో పాటు సమాన పనికి సమాన వేతనం, ఇతర సంక్షేమ ప్రయోజనాలు, అందరికీ పెన్షన్‌, సమ్మె హక్కు, కార్మిక చట్టాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు, కార్మిక సంఘాలకు 45 రోజుల్లోపుగా తప్పనిసరి రిజిస్ట్రేషన్‌, విదేశీ పెట్టుబడులకు అనుమతుల రద్దు, ధరల నియంత్రణ, ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి విస్తరించాలన్న డిమాండ్లను ఈ మహాసభలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. సమాఖ్య కొత్త అధ్యక్షులుగా ఆర్‌జి కార్నిక్‌, ప్రధాన కార్యదర్శిగా ఆర్‌ ముత్తు సుందరం, జాతీయ ఉపాధ్యక్షుడిగా సుకోమల్‌సేన్‌తో పాటు సహాయ ప్రధాన కార్యదర్శులుగా సుభాష్‌ లంబా, శ్రీకుమార్‌ ఎన్నికయ్యారు. వీరితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అజరు ముఖర్జీ, కార్యవర్గ సభ్యులుగా లలాన్‌ పాండ్య, వి షాజహాన్‌, ఆర్‌ తమిళ్‌ సెల్వి, ఎన్‌ చంద్రశేఖర్‌, ఎల్‌ఎన్‌ కైలాషియన్‌, వేద్‌ ప్రకాశ్‌ శర్మ, సమర్‌జిత్‌ రారు చౌదరి, ఉపాధ్యక్షులుగా సుల్తాన్‌ అవులా, ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఎంఎల్‌ సత్కార్‌ ఎన్నికయ్యారు.