Other News

ఉద్యోగులను తొలగించే కుట్రలో సర్కారు

  • సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేశం

లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు కరెంటు కోతను విధిస్తూ ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని సిపిఎం జిల్లా కారదర్శివర్గ సభ్యులు ఎ.మల్లేశం విమర్శించారు. గురువారం నర్సాపూర్‌లోని సిపిఎం కార్యాలయంలో పార్టీ డివిజన్‌ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ ప్రజలపక్షాన పోరాడేది సిపిఎం మాత్రమేనన్నారు. ప్రభుత్వాలు మాత్రం ప్రజలపై భారాలు మోపేందుకు కరెంటు ఛార్జీలను పెంచాలని ప్రయత్నిస్తోందన్నారు. అలా చేస్తే ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కరెంటు కోతను నివారించి బిల్లులు పెంచే యోచన మానుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతున్న జిల్లా సిపిఎం 11వ మహాసభలు జనవరి 1,2 తేదీల్లో జహీరాబాద్‌లో నిర్వహిస్తున్నామని, జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభలో రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిషత్‌ ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు. ఈ మహాసభలను కార్మిక, కర్షకులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్‌ కార్యదర్శి యాదవరెడ్డి, నాయకులు కమల, నందం, నాగరాజు, వాసు, హేమలత, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాల్లోకి వెంటనే తీసుకోవాలి

  • 104 కాల్‌సెంటర్‌ ఉద్యోగుల డిమాండ్‌

వెంటనే ఉద్యోగాల్లో తీసుకోవాలని 104 కాల్‌సెంటర్‌ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 104 కాల్‌సెంటర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం కోఠిలోని ఆరోగ్యశ్రీ 104 కాల్‌సెంటర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవాధ్యక్షులు సయ్యద్‌ ఆరిఫ్‌, ప్రధాన కార్యదర్శి రామ కోటేశ్వరరావు మాట్లాడుతూ 104 కాల్‌సెంటర్‌లో తొలగించిన వెయ్యి మంది ఉద్యోగులను వెంటనే ఉద్యోగాల్లో తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్యశ్రీ 104 కాల్‌సెంటర్‌లో 270 మందిని తీసుకుంటామని చెప్పి 100 మందినే తీసుకున్నారన్నారు. మిగిలిన 170 మందిని వెంటనే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా తక్కిన 700 మందిని కూడా వివిధ డిపార్టుమెంట్లలో తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు అధికారులు హామీనిచ్చారన్నారు. వారిని తీసుకోకుండా తీవ్రజాప్యం చేస్తున్నారని ఆందోళన చేశారు. 109 రోజులుగా తాము రోడ్డు మీద ఆందోళన చేస్తున్నామని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. తీవ్రతను అర్థం చేసుకుని వేగవంతంగా సమస్యలు పరిష్కరించాల్సిపోయి నానబెడుతున్నారని వివర్శించారు. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. దాదాపు నాలుగు నెలలుగా జీతాల్లేక ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే అందరినీ ఉద్యోగాల్లో తీసుకుని ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం నాయకులు అధికారులను కలిసి వినతిపత్రమిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు దేవేందర్‌, భాస్కర్‌, పద్మ, జనార్ధన్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

పెరిగిన వేతనాలు చెల్లించాలి :సిఐటియు

వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్దతిపై పని చేస్తున్న రెండో ఎఎన్‌ఎం లకు జిఓ నెం.1620 ప్రకారం రూ. 10 వేలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ముంజం శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పెరిగిన వేతనాలను కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో చెల్లిస్తున్నారని మరికొన్ని పిహెచ్‌సిలలో వైద్యాధికారులు, సీనియర్‌ అసిస్టెంట్‌ల నిర్లక్ష్యం కారణంగా చెల్లించడం లేదని ఆరోపించారు. వెంటనే పెరిగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిఓ ప్రకారం రెండో ఎఎన్‌ఎంలకు 15 క్యాజువల్‌ సెలవులు, నాలుగు నెలల ప్రసూతి సెలవులను సాధించుకోవడం జరిగిందని అదేవిధంగా ఎఫ్‌టిఎ, యూనిఫాం అలవెన్స్‌, డిఎ, రెగ్యులరేషన్‌ తదితర డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు.

వేతనాల పెంపేది?

  • ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌

అంగన్‌వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేకంగా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, వేతనాల పెంపు గురించి లేకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పేర్కొంది. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచే విధంగా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు బి.లలితమ్మ, పి.రోజా ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పంచాయతీ' కార్మికుల సమస్యలు పట్టవా?

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామ పంచాయతీల్లోని ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌, పార్ట్‌టైమ్‌, ఫిక్స్‌డ్‌ పే, ఫుల్‌టైమ్‌, కంటింజెంట్‌, కాంట్రాక్టు కార్మికులు అంటున్నారు. పదిరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నా నేటికీ పర్మినెంట్‌ చేయట్లేదని ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా నెలనెలా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీ చాలని వేతనాలతో నిరంతరం అభద్రతో జీవిస్తున్న తమకు జి.ఓ.నెం. 3 వర్తింపజేయాలని అడుగుతున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కార్మికుల శ్రమ ఎనలేనిది. అయితే ఇంత ప్రాధాన్యత గల వీరీలో చాలా మంది చాలా కాలంగా ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌, పార్టుటైమ్‌, కంటింజెంట్‌, కాంట్రాక్టు ఇంకా రకరకాల పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడిగా చేస్తున్న తమను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని వీరు కోరుతున్నారు.

రాష్ట్రంలో 21,934 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎన్‌ఎంఆర్‌, పార్టుటైమ్‌ డైలీవేజ్‌, ఫిక్స్‌డ్‌పే, ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌, కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారంతా కలిపి సుమారు 70 వేలమంది ఉన్నారు. వీరిలో ఎక్కువమంది వెనుక బడిన సామాజిక తరగతులవారే ఉన్నారు. కార్మికశాఖ నిబంధనల ప్రకారం కూడా రెగ్యులరైజేషన్‌కు తగిన అర్హత కలిగి ఉన్నారు. అయినా పంచాయతీరాజ్‌ శాఖ అలా చేయట్లేదు. ఎంతో కాలంగ పనిచేస్తున్న వారికి కూడా రూ. 1000 నుంచీ 3000 లోపు చెల్లిస్తున్నారు. రాష్ట్రమంతా ఒకేవిధంగాక ఒక్కో దగ్గర ఒక్కో విధమైన వేతనాలు చెల్లిస్తున్నారు. అది కూడా నెలనెలా ఇస్తున్నారనుకుంటే పొరపాటే. ఏ మూణ్నెల్లకో, ఆర్నెల్లకో ఒకసారి అందుతున్నాయి. అంత వరకూ కార్మికులు పడిగాడపులు కాయాల్సిందే. బతుకు దెరువుకోసం అప్పులు చేయాల్సిందే. తీరా అవొచ్చాక అప్పులకూ, వడ్డీలకే సరిపోతున్నాయి. మళ్లీ అప్పు చేయాల్సొస్తోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కారోబార్లు యాదయ్య, నర్సింలు. కనీస వేతనాలైనా చెల్లిస్తే తమకు ఆ దుస్థితి ఉండదని అంటున్నారు. గ్రామ పంచాయతీల నుంచి వస్తున్న ఆదాయం ప్రభుత్వ ఖజనాకు వెళ్తోంది కానీ. ప్రభుత్వం మాత్రం వాటిలో పనిచేసే కార్మికుల వేతనాలకోసం మాత్రం నిధులు కేటాయించట్లేదు. పంచాయతీల ఆదాయంలోనుంచి ప్రభుత్వానికి పోగా మిగిలిన దానిలోనే సర్దుకోవాలని సూచిస్తోంది. దీనివల్ల కార్మికులు నష్టపోతున్నారు.

జీవోలు అమలు చేయాలి

జి.ఓ.నెం.6 ప్రకారం అన్‌స్కిల్డ్‌ కాంట్రాక్టు కార్మికులకు కనీసం రూ.4030 చెల్లించాలి. కానీ గ్రామ పంచాయతీల్లోని వారికి ఇది కూడా వర్తింపజేయట్లేదు. రెవెన్యూ శాఖలో పదోతరగతి పాసై, ఐదేళ్లు సర్వీసు కలిగివున్న వారికి గ్రామ సేవకులుగా ప్రమోషన్‌ కల్పించిన

జి.ఓ.నెం.39ని గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా వర్తింపజేస్తామని, అర్హులైన వారిని గ్రామ కార్యదర్శులుగా నియమిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంట్రాక్టు కార్మికులందరికీ జి.ఓ.నెం3 ప్రకారం కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పింది. కానీ ఆ మాట నిలబెట్టుకోవట్లేదని 'పంచాయతీ' కార్మికులు అంటున్నారు.

అదనపు పని... అరకొర సౌకర్యాలు

పెరిగిన సేవలకు, అవసరాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో సరిపోను సిబ్బంది లేదు. పనికి చేతగాక మానేసిన వారిస్థానంలో కొత్తవారిని తీసుకోవట్లేదు. ఉన్నవాళ్లతోనే అది కూడా తాత్కాలిక సిబ్బందితోనే అదనపు పనులు చేయిస్తున్నారు. వీరికి కనీస వసతులుగానీ, సౌకర్యాలుగానీ కల్పించట్లేదు. కార్మికుల పనులకోసం అవసరమైన స్టేషనరీ, రక్షణ పరికరాలు, యూనిఫామ్‌, గుర్తింపు కార్డులు లాంటివి కూడా ఇవ్వట్లేదు. పర్మినెంట్‌ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమకు వారికి వర్తించే సౌకర్యాలు తమకూ వర్తింపజేయాలని అడుగుతున్నారు. జి.ఓ.నెం. 1289 ప్రకారం మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్నట్లుగానే తమకూ ఇఎస్‌ఐ, పి.ఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

కార్మికులు కోరుతున్నదేమిటి?

* ఐదేళ్లు పూర్తిచేసిన ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌, పార్ట్‌టైమ్‌, ఫిక్స్‌డ్‌ పే, ఫుల్‌ టైమ్‌ కంటింజెంట్‌, కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేయాలి.

* వేతనాల చెల్లింపు కోసం ప్రభుత్వమే బడ్జెట్‌ కేటాయించాలి.

* హైకోర్టు రిజర్వ్‌డ్‌ చేసిన రెండువేల పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ఇప్పుడు పనిచేస్తున్న అర్హతగల కారోబార్‌, ఇతర

పంచాయతీ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలి.

* పదో తరగతి పాసయ్యి, ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలి.

* పంచాయతీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలి.

* ప్రతినెలా రెగ్యులర్‌గా వేతనాలు ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి.

* పర్మినెంట్‌ సిబ్బందితోపాటు పార్ట్‌టైం, కాంట్రాక్టు సిబ్బందికి కూడా యూనిఫామ్‌, చెప్పులు, టవల్స్‌, నూనె, సబ్బులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలి.

*ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

ప్రజారోగ్యం పట్టదా?

గత వంద రోజులుగా104 సర్వీస్‌ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ప్రపంచ బ్యాంకు సంస్కరణలను బాగా వంటబట్టించుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నిద్రపోతోందా? లేక నిద్రపోతున్నట్లు నటిస్తున్నదా? గ్రామీణ ప్రజారోగ్య పరిరక్షణలో విశేషమైన సేవలందిస్తున్న 104 ఉద్యోగుల సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఏటా లక్ష ఉద్యోగాలిస్తామని ఒక వైపు ఊదరగొడుతూ, మరో వైపు ప్రజారోగ్య పరిరక్షణలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న సిబ్బందిని కుదించి ఇబ్బందుల పాల్జేయడం ఏ తరహా విలువలకు నిదర్శనమో ఏలికలే సెలవివ్వాలి. ప్రపంచ బ్యాంకు సంస్కరణల్లో భాగంగా కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థను ఒక పథకం ప్రకారం నీరుగార్చింది. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా చూసేందుకు, అదే సమయంలో కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ఆరోగ్యశ్రీని గత వైయస్‌ సర్కార్‌ ఆవిష్కరించింది. ఆరోగ్యశ్రీతోబాటే 104, 108 సర్వీసులను కూడా ప్రవేశపెట్టారు.. ఆరోగ్యశ్రీ వల్ల సామాన్యులకు కొంత మేలు జరిగిన మాట నిజం. అయితే, అంతకన్నా ఎక్కువగా ఇది కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఉపయోగపడిందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఆరోగ్యశ్రీ బీమా కింద ఏటా ఖర్చు చేస్తున్న నాలుగు వేల కోట్ల రూపాయల్లో సింహభాగం ఈ ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల బోషాణాల్లోకి నేరుగా వెళ్లింది. 104 సర్వీసులోనూ కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రయోజనాలు కొంతమేర ఇమిడి ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువగా నాలుగు కోట్ల గ్రామీణ జనాభాకు ప్రాథమిక వైద్య సేవలందించడంలో మంచి పాత్ర నిర్వహిస్తున్నది. 3,500 మంది సిబ్బందితో, 31వేల పైచిలుకు గ్రామాలకు తన సేవలను విస్తరిస్తూ మొత్తం 15 లక్షలకుపైగా రోగుల చెంత చేరింది. అటువంటి ఈ 104 సర్వీసుల నిర్వహణలో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులూ పెట్టింది. అయినా సిబ్బంది దీక్షాపట్టుదలతో పనిచేయడం ద్వారా దీనిని ఇంతవరకు లాక్కొచ్చారు. 108 సర్వీసుకు తూట్లు పొడిచినట్లుగానే 104 సర్వీసును కూడా తూట్లు పొడిచి నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకే ఒక్క కలంపోటుతో 1218 మంది సిబ్బందిని తొలగించింది. గ్రామీణ ప్రాంత పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో విశేష కృషి చేస్తున్న వీరికి కనీసవేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం మొండికెయ్యడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ధరలు పెరిగాయన్న పేరుతో గౌరవ మంత్రులు, ప్రజా ప్రతినిధుల వేతన భత్యాలను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత పెంచే ప్రభుత్వం ఈ బడుగు జీవులకు కనీస వేతనం ఇవ్వడానికి ఎందుకింత పీకులాడుతున్నదో అర్థం కావడం లేదు. 104 సర్వీసులో పనిచేస్తున్న 3,500 మందికి కనీస వేతనాలను అమలు చేస్తే సంవత్సరం మొత్తం మీద మహా అయితే కోటి రూపాయల లోపే ఖజానాపై అదనంగా భారం పడుతుంది. ఇది ఒక కార్పొరేట్‌ సంస్థకు ప్రభుత్వం ఒక సారి ఇచ్చే రాయితీలకన్నా తక్కువే. వీటికి భూములను ఉచితంగా ఇచ్చి, పన్నుల్లో రాయితీలు ఇస్తే ఈ ఆసుపత్రులు ఏం చేస్తున్నాయి? చికిత్సకు సంబంధించిన కేసులైతే పది శాతం, అవుట్‌ పేషెంట్‌ కేసులైతే 40 శాతం దాకా పేదలకు ఉచితంగా సేవలందించాలన్న నిబంధనలను అవి ఎన్నడూ పాటించిన పాపాన పోలేదు. అయినా, ప్రభుత్వం వీటికి ఆరోగ్యశ్రీ పేరుతోనూ, పన్నుల రూపంలోనూ రాయితీలు ఇస్తూనే ఉంది. 104 సర్వీసులో పని చేసే సిబ్బందిలో ఎక్కువ మంది అట్టడుగు వర్గాలకు చెందినవారే. ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల ఈ కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధినపడే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచబ్యాంకు సంస్కరణల అమలులో భాగంగా గ్రామీణ ఆరోగ్య సేవలను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దానిపై వేటువేసి ప్రజారోగ్యాన్ని గాలికొదిలేయడం బాధ్యతారాహిత్యమే అనిపించుకుంటుంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రజారోగ్య రంగంలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సీలు) నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు వాటి కార్యకలాపాలు కుటుంబ నియంత్రణకే పరిమితమైపోయాయి. ప్రపంచ బ్యాంకు సంస్కరణలు రాక ముందు ప్రజారోగ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు ముఖ్యమైన పాత్ర నిర్వహించాయి. 1996-97 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులు రావడం మొదలయ్యాక ప్రభుత్వ ఆసుపత్రులను బలహీనపరిచే ప్రక్రియ జోరందుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధుల నివారణ దగ్గర నుంచి చిన్న పిల్లల టీకాల కార్యక్రమం వరకు అన్నీ కుంటుపడ్డాయి.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీ ఉన్నా అది కొన్ని జబ్బులకే పరిమితం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. దీంతో ప్రాథమిక వైద్యం కూడా పేదలకు అందుబాటులో లేని స్థితి ఏర్పడింది. దీనికి తోడు మున్సిపల్‌ సంస్కరణలు తెచ్చి మంచినీటి సరఫరా, పారిశు ధ్యం వంటి రంగాలను ప్రైవేటు పరం చేస్తున్నది. వీటన్నిటి ఫలితంగా ప్రజారోగ్యం దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. దీనికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ విధానాలే. ఇతర రంగాలను చూసినట్లు ప్రజారోగ్య రంగాన్ని కూడా వ్యాపార దృష్టితో ప్రభుత్వం చూడడం తప్పు. అందరికీ ఆరోగ్యం అని 1972 అల్మాఅటా తీర్మానంలో ఆమోదించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు దానికి పూర్తి రివర్స్‌్‌లో వ్యవహరించడం శోచనీయం. ప్రభుత్వ ధోరణే ఇలా వుంటే అధికార యంత్రాంగంలో కదలిక ఎలా వస్తుంది? ప్రభుత్వంలో కదలిక రావాలంటే ఉద్యమాలు అనే ముల్లుగర్రతో గట్టిగా పొడవాలి. అందుకే 104 సర్వీసు సిబ్బంది చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు పలకాలి. ప్రొగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ వీరికి మద్దతుగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టడం అభినందనీయం. బాధ్యతగల ప్రజా ప్రతినిధి దీక్షలో కూర్చొని అయిదు రోజులైనా ప్రభుత్వంలో చలనం లేదు. ఈ పరిస్థితుల్లో శుక్రవారంనాడు రాష్ట్ర మంతటా ప్రజారోగ్య పరిరక్షణ దినం పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, ఆశాలు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితర ప్రజాసంఘాలన్నీ పూనుకోవడం ఎంతో సముచితం. ప్రజారోగ్యం పట్ల, 104 సర్వీసు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించేలా చూసేందుకు పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి.

జిల్లా వ్యాప్తంగా 104 సిబ్బందికి మద్దతు

  • ధర్నాలు, వినతిపత్రాలతో ఆందోళన - సమస్యలు పరిష్కరించాల్సిందేనని హెచ్చరిక

వంద రోజులుగా దీక్షలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందిచకపోవడానికి నిరసనగా 104 ఉద్యోగులకు మద్దతుగా పలు మండలాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, ప్రదర్శనలు శుక్రవారం నిర్వహించారు. సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామనే హెచ్చరికను జారీ చేశారు.

వంద రోజుల నుండి చేస్తున్న 104 ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా స్ట్రెచర్‌పై 104 వాహనాన్ని తీసుకెళుతూ సిఐటియు ఆధ్వర్యంలో వినూత్న నిరసన శుక్రవారం నిర్వహించారు. స్థానిక బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయం నుండి శంకర్‌విలాస్‌ సెంటర్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ 104, 108, ఆరోగ్యశ్రీ సేవలు ద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చామని గొప్ప చెప్పుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ సేవల్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గమన్నారు. 104 వాహనంలో పేదలకు సరిపడనన్ని మందులు ఉంచాలని, చట్ట ప్రకారం జీవో నెం.3 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె నళినీకాంత్‌ మాట్లాడుతూ 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ ఐదు రోజులుగా నిరవధిక దీక్షకు దిగినా ప్రభుత్వం పట్టించుకకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తక్షణం పట్టించుకుని పరిష్కారం చేయకపోతే భవిష్యత్‌లో అన్ని సంఘాలను కలుపుకుని పెద్దఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రదర్శనలో టిబి కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్యామూల్‌, హెచ్‌.ఐ.వి కౌన్సిలర్‌ సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బారావు, ఇన్యూరెన్స్‌ యూనియన్‌ నాయకులు సురేష్‌, వి రమేష్‌ పోస్టల్‌ యూనియన్‌ నాయకులు నాగేశ్వరరావు, కంప్యూటర్‌ టీచర్స్‌ యూనియన్‌ నాయకులు వెంకటేశ్వర్లు, జెవివి జిల్లా ప్రధాన

కార్యదర్శి నక్కా వెంకటేశ్వర్లు ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కాపు శ్రీనివాస్‌, ఐద్వా నాయకులు అరుణ, షహనాజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భగవాన్‌దాస్‌, కృష్ణకాంత్‌, సిఐటియు నాయకులు వేమారెడ్డి, కె శ్రీనివాస్‌, షకీల పాల్గొన్నారు.

 

పలు చోట్ల 104 ఉద్యోగుల సమ్మెకు మద్దతు

తాడేపల్లిలో...

తాడేపల్లి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి రెండోసారి అధికారంలోకి రావడానికి ఆనాడు ప్రచారసభల్లో కురుకురు మంటూ 104, 108 సేవలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని, అయితే ప్రస్తుతం 104, 108 ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారించాలని కుయ్యోమొర్రో అంటున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి దుయ్యబట్టారు. 104, 108 ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా తాడేపల్లి తహశీల్దార్‌ కార్యాలయంవద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి వేముల దుర్గారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పేదలకు కొద్దిమేరకైనా ఉపయోగపడుతున్న 104, 108 సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. వంద రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ గేయానంద్‌ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే అన్ని ప్రజాసంఘాలతో కలిసి అంకుశంతో పొడిచి దారికి తీసుకువస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు కెవి.పూర్ణచంద్రరావు, కెవిపిఎస్‌ నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, సిహెచ్‌.యాకోబు, సిఐటియు నాయకులు, కె.పౌలు, ఈ.నరసింహారావు, ఎస్‌కె.లాల్‌బి, కె.రాజ్యం, ఎస్‌కె జిలాని, వై.ప్రసాద్‌, మీరావలి, ఐ.నాగేశ్వరరావు, పి.ప్రభాకర్‌, టి.కోటిరెడ్డి, ఎ.శౌరిబర్తులం, ఐద్వా బి.సరస్వతి, వి.కోటేశ్వరమ్మ, బి.నవనీతం, ప్రజానాట్యమండలి కొట్టే కరుణాకరరరావు, ఆవాజ్‌ ఎస్‌ఎం.బాషా, సర్ధార్‌, వృత్తి సంఘాల నాయకులు ఈమని రామారావు, దేవళ్ల శంకరరావు, చౌక దుకాణదారుల సంఘం నాయకులు శివనాగేశ్వరరావు, బి.బ్రహ్మానందం, ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ యూనియన్‌ నాయకులు కె.స్టీవెన్‌, వి.మోహన్‌, ఎస్‌.బెనర్జీ, రైతు సంఘం ఎం.శ్రీనివాసరెడ్డి, డి.బుల్లికోటిరెడ్డి, డివైఎఫ్‌ఐ డి.విజరు, ఎన్‌.దుర్గారావు, గిరిజనసంఘం చిరంజీవి పాల్గొన్నారు.

మంగళగిరిలో...

మంగళగిరి : ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిచారు. సిఐటియు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జె.నవీన్‌ప్రకాష్‌ మాట్లాడుతూ ప్రజారోగ్యంపై ప్రభుత్వం చొరవ చూపడంలేదని విమర్శించారు.. '104' సేవలను నిర్వీర్యం చేయాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌చేశారు. జీవోనెం.3 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. తొలుత ప్రజాసంఘాల కార్యాలయం నుండి ప్రదర్శనగా ట్రంకురోడ్డు మీదుగా తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ ఉపాధ్యక్షులు జెవి.రాఘవులు, చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పిల్లలమర్రి బాలకృష్ణ, ఎపి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ యూనియన్‌ నాయకులు పిఎన్‌.మూర్తి, ఎ.జయరాజు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఎస్‌ఎస్‌.చెంగయ్య, కె.వెంకయ్య, కె.మణికుమారి, కె.అంకమరావు, డి.రామారావు, ఎం.ఫకీరయ్య, షంషేర్‌ఖాన్‌, జి.రవిబాబు, ఎం.జగదీశ్‌, వి.దుర్గారావు పాల్గొన్నారు.

పెదకాకానిలో...

పెదకాకాని : 104 కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే తీవ్ర ఉద్యమం తప్పదని జిల్లా రైతు సంఘ మండల ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజరుకుమార్‌ అన్నారు. 104 సిబ్బంది పోరాటానికి మద్దతుగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రతి 104 వాహనానికి ఒక వైద్యుడ్ని నియమిస్తామన్న ప్రభుత్వ వాగ్దానం అమలులో చేయకపోగా నిర్వీర్యానికి కుట్రపన్నడం దారుణమన్నారు. కనీసం ప్రసూతి సెలవులకూ మహిళా సిబ్బంది నోచుకోలేదన్నారు. అనంతరం డిప్యూటి తహశీల్దార్‌ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి నన్నపనేని శివాజి, రైతు సంఘం నాయకులు బోయపాటి వెంకటేశ్వరరావు, జిఎన్‌.ప్రసాద్‌, చిగురుపాటి రామయ్య, కోటిపల్లి సత్యనారాయణ, బురదగుంట సాంబయ్య పాల్గొన్నారు.

చిలకలూరిపేటలో...

చిలకలూరిపేట :గ్రామీణ ప్రారత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులు సమ్మె శుక్రవారం నిర్వహించారు. తొలుత కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి పోపూరి సుబ్బారావు మాట్లాడుతూ 104 ఉద్యోగులు వంద రోజుల నుండి వారి సమస్యలు పరిష్కరించాల్సిందిగా వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. తొమ్మిది రోజుల నుండి 104 ఉద్యోగుల నిరవధిక దీక్షలు చేపట్టినా నాలుగు రోజుల నుండి వీరికి మద్దతుగా డాక్టర్‌ గేయానంద్‌ దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఎలాంటి మార్పులేక మొండి వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. 104 వాహనంలో ప్రజలకు సరిపడా మందులు లేవని, జివో నెం 3 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, తొమ్మిది నెలల డిఎ బకాయిలు ఇవ్వాలని అన్నారు. 104 ఉద్యోగుల సమ్మెను విరమింపచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు పేరుబోయిన వెంకటేశ్వర్లు, సాతులూరిబాబు, విల్సన్‌, 104 సిబ్బంది అరీఫాఖాన్‌, వెంకటరత్నం, జిలాని, మానస పాల్గొన్నారు.

నాదెండ్లలో..

నాదెండ్ల : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే 104 సిబ్బంది చేస్తున్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. 104 సిబ్బంది చేస్తున్న సమ్మెకు మద్దతుగా సిఐటియు నాదెండ్ల మండల, ఐద్వా, మహిళా సంఘాలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహాశీల్దార్‌ మోహనరావుకు శుక్రవారం సమర్పించారు. కార్యక్రమంలో చాగంటి అమరమ్మ, శోబారాణి, మరియమ్మ, పద్మ, సావిత్రి పాల్గొన్నారు.

 

ఉధృత దిశగా 104 సిబ్బంది పోరాటం

  • వందరోజులుగా దీక్షలు
  • పలు గ్రామాలకు నిలిచిపోనున్న వైద్యసేవలు
  • 104 దీక్షలకు ప్రజాసంఘాల మద్దతు
  • నేడు మండల కేంద్రాల్లో ధర్నాలు

ప్రతి గ్రామానికి ప్రభుత్వ వైద్యసేవలు, ప్రతి 104 వాహనానికి ఒక ఎంబిబిఎస్‌ డాక్డర్‌, కారట్రాక్టు కార్మికులందరికీ జిఓ 3 అమలు ఒకప్పుడు ప్రభుత్వం చెప్పిన మాటలు. మందులు లేకుండా గ్రామాలకు రావడం ఎందుకు, పరీక్షలు మేం చేయించుకోలేమా, గ్రామం నుండి వెళ్లిపోండి... సిబ్బందిపై ప్రజల మండిపాటు. సిబ్బందిని పెంచండి, జిఓల ప్రకారం వేతనాలివ్వండి, నిర్వహణా ఖర్చులు, మందులు సక్రమంగా పంపిణీ చేయండంటూ పోరుబాటలో 104 సిబ్బంది.
 

తమ సమస్యలు పరిష్కరించాలని 104 ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఆగస్టు నుండి కోరుతూ వస్తున్నారు. 100 రోజులుగా హైదరాబాద్‌లో దీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చారు. అన్ని స్థాయిల్లోనూ వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. అయితే 104 వైద్య సేవలను కుదించి తనపై ఉన్న ప్రజారోగ్య భారాన్ని తొలగించు కునేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా వాహనాలకు కల్పించాల్సిన సౌకర్యాలను కుదిస్తున్నారు. దీంతో ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయినుండి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు పూను కున్నారు. దానిలో భాగంగా శుక్రవారం ప్రతి మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహించేందుకు పూనుకున్నారు.

ప్రజారోగ్యానికీ ముప్పే

ఉద్యోగులు కేవలం తమ ఆర్థికపరమైన అంశాలను మాత్రమే పరిష్కరించాలని కోరడంలేదు. 104ను నిర్వీర్యం చేయాలనే ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 24,104 వాహనాలు ఉన్నాయి. వాస్తవానికి ప్రతి వాహనానికీ డ్రైవరు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్టూ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఎఎన్‌ఎం ఉండాలి. వీరికి వారాంతపు సెలవులు ఇచ్చినప్పుడు వారిస్థానంలో పని చేసేందుకు ప్రత్యామ్నాయ సిబ్బంది ఉండాలి. అంటే వాహనానికి 1:5 నిష్పత్తిలో సిబ్బంది ఉండాలి. అయితే వీరిని 1:1కు కుదించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. వాహనాల నిర్వహణకు ఇవ్వాల్సిన ఖర్చులను తగ్గిస్తున్నారు. ఇచ్చేది కూడా సరైన సమయానికి ఇవ్వడంలేదు. సిబ్బందే తమ సొంత ఖర్చులతో వాహనాలకు లైట్లు వేయించుకున్న సందర్భాలు జిల్లాలో కోకొల్లలు. దీనికి తోడు వాహనాలకు అవసరమైన మందులను సకాలంలో అందిచడంలేదు. దీంతో సిబ్బంది

గ్రామాలకు వెళ్లినప్పుడు కేవలం పరీక్షల చేయడానికి, ముందులు రాయడానికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో ప్రజలు సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందులివ్వలేని కాడికి మీరెందుకు వస్తున్నారని నిలేస్తున్నారు. ప్రభుత్వం తప్పుకి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

పథకం ప్రకారమే సేవల కుదింపు

ప్రభుత్వం మొదట్లో వాహనాల నిర్వహణా బాధ్యతలను హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్స్‌ ఇనిస్టిట్యూట్‌ (హెచ్‌ఎంఆర్‌ఐ) అనే ప్రయివేటు సంస్థకు అప్పగించారు. అప్పట్లో సిబ్బంది పోరాటాలు చేసి ప్రభుత్వమే 104ను నిర్వహించి ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి 104ను తన అధీనంలోకి తీసుకుంది. అయితే హెచ్‌ఎంఆర్‌ఐ నియమించిన డిసి, ఎడిసిలను తొలగించకుండా అనవసరంగా కొనసాగిస్తోంది. ఇదే సందర్భంలో వాహనాల సిబ్బందిని కుదిస్తూ ఎఎన్‌ఎమ్‌లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను పిహెచ్‌సిలకు పంపుతున్నారు. దీంతో 104 సేవల్లో ఉన్న కొద్దిమంది సిబ్బంది తమ సేవలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారు. మొత్తంగా 104ను నిర్వీర్యం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి 104ను మళ్లీ ప్రయివేటు సంస్థకు అప్పగించేలా సిఫారసులను సిద్ధం చేస్తున్నారు. తద్వారా ప్రజారోగ్య బాధ్యత నుండి విరమించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

జిఓల అమలెక్కడ ?

ప్రభుత్వం విడుదల చేసిన జిఓ ప్రకారం చూసుకున్నా అన్ని కటింగులు పోనూ 104 డ్రైవర్‌కు నెలకు రూ.9600, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.9400, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.10200, ఫార్మాసిస్టులకు రూ.10200 ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వీరికి ఇస్తున్న వేతనాలు సగం కోతపెట్టి రూ.5800, 4800, 5800, 5800 మాత్రమే. వీరికిచ్చే రూ.1000 డిఎని తొమ్మిది నెలలుగా నిలిపివేశారు. వారంతపు సెలవులను అమలు చేయడంలేదు. కనీసం ప్రసూతి సెలవులకూ మహిళా సిబ్బంది నోచుకోలేదు. ప్రభుత్వం ప్రారంభంలో ప్రకటించినట్లు ప్రతి వాహనానికి వైద్యుడ్ని నియమిస్తామనే వాగ్దానం అమలుకు నోచుకోలేదు. దీంతో కార్మికులు తమ ఆర్థిక అవసరాలు గడవని పరిస్థితిలో, మందులు లేకుండా ప్రజలకు వద్దకు వెళ్లలేని స్థితిలో ఆందోళనకు పూనుకున్నారు.

104ఉద్యోగులదీక్షకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో

104 ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా మండలకేంద్రంలోని రైల్వే గేట్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని 104 సిబ్బంది 45 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం సరైన పద్దతి కాదని బోధన్‌ డివిజన్‌ సిఐటియు అధ్యక్షులు యేశాల గంగాధర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ 3 ప్రకారం వారికి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్మికులు, మధ్యాహ్న భోజన వర్కర్స్‌, గ్రామపంచాయతీ వర్కర్స్‌ విజయలకీë, తులసి, హేమలత, నీలా, లకీë పాల్గొన్నారు.

 

104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో

104 ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి పగిడికత్తుల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నేలకొండపల్లిలోని స్థానిక పొట్టిశ్రీరాములు సెంటర్‌లో శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 44 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఐదు రోజులుగా 104 ఉద్యోగులకు మద్దతుగా ఎంఎల్‌సి డాక్టర్‌ గేయానంద్‌ నిరవధిక దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి అద్దంపడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామదీపికల యూనియన్‌ మండలాధ్యక్షులు గుత్తికొండ రాణి, ఆశా యూనియన్‌ నాయకులు ఎస్‌.జ్యోతి, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా నాయకులరాలు బి.కోటేశ్వర్‌, బందెల రూపీ, ఆటోయూనియన్‌ నాయకులు తిరుపతిరావు, సిహెచ్‌.శ్రీను, కె.నాగేశ్వరావు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ డివిజన్‌ అధ్యక్షులు గంధం వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో

కూసుమంచి: 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జిఓ 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని వారిని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ 44 సమ్మె చేస్తున్న వారికి సంఘీభావంగా శుక్రవారం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోనుద్దేశించి సిఐటియు పాలేరు డివిజన్‌ అధ్యక్షులు తాళ్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 104,108 ఉద్యోగులను నిర్వీర్యం చేస్తే సహించేది లేదని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొక్కిరేని రమణ, ఇర్రి వెంకటరత్నం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఖమ్మం రూరల్‌ మండలంలో...

44 రోజులుగా నిర్వహిస్తున్న 104 ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని చింతపల్లి, గుర్రెలపాడు, మద్దివారిగూడెం సెంటర్లలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి పెరుమాళ్ల పల్లి మోహన్‌ రావు మాట్లాడారు. 104 ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంస్థలు ఆశావర్కర్లు, పంచాయతీ వర్కర్క్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌, గ్రామదీపికలు పాల్గొన్నారు. రాస్తారోకోలో విజయలకిë, కృష్ణవేణి, జ్యోతి, రాధ, లకిë, లలిత, పద్మ, నాగమణి పాల్గొన్నారు.